Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Monday, January 13, 2014

వైదిక సిద్ధాంతం - సీంహావలోకనం (3 వ భాగం)



వేద ఋక్కులని, కర్మకాండని ఆరంభంగా తీసుకుని అధ్యాత్మిక చింతన మీద, అనుభవం మీద ఓ కొత్త వ్యాఖ్యానంగా వెలువడ్డ కృతులే బ్రాహ్మణాలు, ఉపనిషత్తులూను. అలా ఆరంభమైన అధ్యాత్మిక పునరుద్దీపనంలో రెండు పరస్పర పరిపూరక అంశాలు ఉన్నాయి. ఒకటి గతానికి చెందిన బాహ్యరూపాల సంరక్షణ. రెండవది వేద సారం యొక్క నవ్య ప్రకటన. ఇందులో మొదటి దానికి బ్రాహ్మణాలు చిహ్నాలు. రెండవ దానికి ఉపనిషత్తులు సంకేతాలు.

వైదిక కర్మకాండకి చెందిన సూక్ష్మాలని, వాటి భౌతిక సాఫల్యానికి కావలసిన నిబంధనలని, అందులోని వివిధ విభాగాల యొక్క, క్రియల యొక్క, ఉపకరణాల యొక్క ప్రయోజనాన్ని, ప్రతీకాత్మక అంతరార్థాన్ని, కర్మకాండకి సంబంధించిన వివిధ మంత్రాల యొక్క ప్రాముఖ్యతని, గతించిన గాధల, సాంప్రదాయాల జ్ఞాపకాలని తిరిగి స్థాపించి, సుస్థిరంగా ప్రతిష్టంచడమే బ్రాహ్మణాల లక్ష్యం. అందులో ప్రస్తావించబడ్డ ఎన్నో గాధలు ఋక్కుల కన్నా పురాతనమైనవని స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికే అర్థం కాకుండా పోయిన ఎన్నో విభాగాలని వివరించడం కోసం ఆ గాధలు కల్పించబడ్డాయి. ఇక మరి కొన్ని గాధలు, కథలు ప్రతీకాత్మక పద్ధతిని వాడిన ప్రాచీన కవుల ఉపకరణాలు మాత్రమే కావచ్చు. లేదా ఋక్కులు విరచించబడ్డ కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘట్టాలే కావచ్చు. మౌఖిక సాంప్రదాయంలో జ్ఞానాన్ని ప్రసారం చేసినప్పుడు అందులోని తేజం మరుగుపడే అవకాశం ఎక్కువ. పాత ప్రతీకల స్థానంలో కొత్త ప్రతీకలు వచ్చినప్పుడు, పాత జ్ఞానాన్ని కొత్త ప్రతీకలు కప్పిపుచ్చే ప్రమాదం వుంది. కనుక బ్రాహ్మణాలలో ఎన్నో ఆసక్తికరమైన సూచనలున్నా అందులో మన పరిశోధనకి పనికొచ్చే అంశాలు బహుతక్కువ. వివిధ వేద విభాగాల అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో అవి విశ్వసనీయమైన మార్గదర్శకాలు కాలేవు. ఎందుకంటే బ్రాహ్మణాలు వేదాలలోని స్థూలార్థాన్నే నిశితంగా నిర్ధారించే పద్ధతిని అవలంబిస్తాయి. వేదసారాన్ని వెలికి తీయాలంటే అటువంటి పద్ధతి సముచితం కాదు.

ఉపనిషత్తు వ్రాసిన ఋషులు అవలంబించిన పద్ధతి పూర్తిగా వేరు. ధ్యానం చేత, అధ్యాత్మిక అనుభూతి చేత వినష్టమైన జ్ఞానాన్ని తిరిగి సాధించే ప్రయత్నం చేశారు వీళ్లు. వారి సొంత అనుభూతులకి, అంతఃప్రకాశనాలకి వేదమంత్రాలని ఒక ఆధారంగా, ప్రమాణంగా వాడుకున్నారు. వేద శబ్దాన్ని భావబీజంగా వాడుకుని పాత సత్యాలని కొత్త రూపాల్లో పునరావిష్కరించారు. అలా ఆవిష్కరించిన దాన్ని వారు జీవించిన వర్తమాన యుగానికి చెందిన పరిభాషలో వ్యక్తం చేశారు. వేదమంత్రాలతో వారు వ్యవహరించిన తీరులో ఓ ప్రత్యేక వ్యక్తిగత ఉద్దేశం వుంది. ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్న పండితుడు ఆ గ్రంథంలోని శబ్దాల, వాక్యాల అర్థాన్ని వీలైనంత కచ్చితంగా, నిర్దుష్టంగా స్థాపించాలని పాటుపడతాడు. కాని ఉపనిషత్ రచయితల కాంక్ష అటువంటిది కాదు. వారు అన్వేషిస్తున్నది భాషకి అతీతమైన సత్యం. వారు తపిస్తున్న అంతఃప్రకాశనానికి పదాలు కేవలం సున్నితమైన సూచనలు మాత్రమే. శబ్దం యొక్క వ్యుత్పత్తిని కొన్ని సార్లు విస్మరించేవారు, లేదా కొన్ని సందర్భాలలో సరైన వ్యుత్పత్తి వారికి తెలిసేది కాదు. పదంలోని ఉపశబ్దాల అన్వయంలో వారు వాడిన ప్రతీకాత్మక పద్ధతిని అర్థం చేసుకోవడం, అనుసరించడం సులభం కాదు. ఆ కారణం చేతనే, ఒక పక్క ప్రాచీన ఋషులు స్థాపించిన భావవ్యవస్థ పట్ల, మౌలిక భావనల పట్ల ఉపనిషత్తులు ప్రసరించే కాంతి అమూల్యమైనదే అయినా, మరో పక్క వేదాల యొక్క అసలు అర్థాన్ని ప్రకటించడంలో బ్రాహ్మణాలకు మల్లె ఇవి కూడా అంతగా ఉపకరించలేదు. ఉపనిషత్తుల అసలు ప్రయోజనం వేదాల అన్వయం కాదు, వేదాంతం యొక్క సంస్థాపనం.


 ("వైదిక సిద్ధాంతం - సింహావలోకనం" అనబడే రెండవ అధ్యాయం సమాప్తం)

No comments:

Post a Comment