Thoughts and Aphorisms (సూక్తులు – సుభాషితాలు)
శ్రీ అరొబిందో
జ్ఞానం
1. మనిషిలో జ్ఞానం,
వివేకం అనే సజాతీయ శక్తులు రెండు ఉన్నాయి. విరూపమైన యానకం లోనుండి చూడగా అవిస్పష్టంగా
కనిపించే సత్యమే జ్ఞానం. మనసు దానిని తడబడుతూ, తడుముకుంటూ అందుకుంటుంది. దివ్యనేత్రానికి
ఆత్మలో సునాయాసంగా దర్శనమయ్యేదే వివేకం.
2. సనాతన అనంత
జ్ఞాన సాగరం నుండి ఎగసిన సన్నని మెరుపుల స్రవంతి స్ఫూర్తి. ఏ విధంగా అయితే వివేచన ఐంద్రియ
జ్ఞానాన్ని అధిగమిస్తుందో, అదే విధంగా స్ఫూర్తి వివేచనను అధిగమిస్తుంది.
3. నేను మాట్లాడబోయే
ముందు వివేచన ‘ఇది నేను చెబుతాను’ అంటుంది. కాని అంతలో భగవంతుడు నా నోటి మాట కాజేయగా
నే పలికిన పలుకులకి వివేచన దిగ్భ్రాంతి చెందుతుంది.
4. నేను జ్ఞానిని
కాను. ఎందుచేతనంటే తన కార్యం కోసం భగవంతుడు నాకు ప్రసాదించిన జ్ఞానం తప్ప నాకు మరొకటి
తెలియదు. మరి చూసినది సమంజసమో కాదో నాకెలా తెలుస్తుంది? అసలు ఆ ప్రశ్నే రాదు. ఎందుకంటే
ప్రత్యక్షంగా చూసినది తప్పక సత్యమే అవుతుంది. అందులో న్యాయాన్యాల మీమాంస ఉండదు.
5. మన జంతు పరిణామ
గతి ఇంకా చేరుకోని చైతన్య భూమికలలో ఎటువంటి అపరిమిత ఆనందావకాశాలు, పరిపూణశక్తులు, స్వప్రకాశ
సహజ జ్ఞాన సరస్సులు, ఏ విశాల వినీల ఆత్మతలాలు మన రాక కోసం ఎదురుచూస్తున్నాయో మనం క్షణకాలమైనా
అనుభూతి చెందితే, సర్వాన్నీ విడిచి ఆ ఐశ్వర్యాన్ని చేజిక్కించుకున్నంతవరకు మానవాళి విశ్రమించదు. కాని దారి ఇరుకు దారి. ద్వారాలు
దుర్భేద్యాలు. పైగా సామాన్యమైన బయళ్ల నుండి మనం దూరంగా మళ్లకుండా నివారించడానికి ప్రకృతి
స్థాపించిన ద్వారపాలకులు – భయ, సంశయ, అవిశ్వాసాలు – ఉండనే ఉన్నాయి కదా.
6. వివేచన చచ్చినపుడే
ప్రజ్ఞానం జనిస్తుందని ఆలస్యంగా కనుగొన్నాను. ఆ విముక్తికి ముందు నాకు తెలిసింది జ్ఞానం
మాత్రమే.
7. అబద్ధపు దృగ్గోచర
విషయాల్ని వివేచన చేత నిజమని స్వీకరించడాన్నే జ్ఞానం అంటారు. కాని ప్రజ్ఞానం తెర వెనుకకు
తొంగి చూడగలదు.
8. వివేచన విషయాలని
విశ్లేషించి, భేదాలని ఎత్తి చూపి, వివరాలని నిర్దేశిస్తుంది. ప్రజ్ఞానం విభేదాలను ఘనంగా
సామరస్య పరచి ఏకీకరిస్తుంది.
9. నీ నమ్మకాలే జ్ఞానం అని తలపోసి, ఇతరుల నమ్మకాలు
పొరబాట్లని, అజ్ఞానమని, ఆత్మవంచన అని ముద్రవేయకు. ఇతర వర్గాల స్థిర అభిప్రాయాలని, అసహన
వైఖరిని దుయ్యబట్టకు.
10. ఆత్మ దేనినైతే
దర్శించి అనుభూతి చెందుతుందో దాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటుంది. ఇక తక్కినదంతా అభిప్రాయం,
అపోహ, అభూతకల్పన.
No comments:
Post a Comment