Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Friday, December 27, 2013

వైదిక సిద్ధాంతం - సింహావలోకనం (2)



వైదిక చింతనలోని మారని సారంతో పాటు అందులోని లోతు, సునిశితత్వం, శిల్పసౌందర్యాలని జోడించి పరిగణిస్తే కొంత ఆసక్తికరమైన చర్చకి అవకాశం ఏర్పడుతుంది.  అంత సుస్థిరమైన శిల్పం, సారం ఒక జాతి యొక్క చింతనా చరిత్ర యొక్క, అనుభవైక చరిత్ర యొక్క తొలిదశలలో సాధ్యం కాదని సులభంగా వాదించడానికి వీలవుతుంది. కనుక మనకి తెలిసిన వేద సంహిత ఒక ప్రత్యేక కాలం యొక్క ఆరంభాన్నో, వికాస క్రమంలోని మధ్యంతర స్థితులనో, కాకుండా అంతిమ స్థితిని సూచిస్తోందని అనుకోవలసి వస్తుంది. వేదంలో మనం అత్యంత ప్రాచీనం అని తలపోసే ఋక్కులు కూడా, ఒక విధంగా కొంచెం అర్వాచీన పరిణామానికి చిహ్నాలు కావచ్చు. మరింత పూర్వపు మానవ భాషలో వ్యక్తం చెయ్యబడ్డ ప్రాచీన దివ్యగీతికలని, కాస్త అర్వాచీనమైన, నమ్యమైన శిల్పంలో పోతపోయగా పుట్టిన రచనలు కావచ్చు (*). లేదా అసలు వేదసాహిత్యం సమస్తమూ, ఏదో ప్రాచీన ఆర్య కవితా రాశి నుండి వేద వ్యాసుడు ఎంచుకున్న కొన్ని ప్రత్యేక గీతాల సముదాయమే  కావచ్చు. మరి అపారమైన వ్యాస సంకలనం చేశాడు కనుకనే వ్యాసుడికి ఆ పేరు వచ్చింది. ఆసన్నమవుతున్న కలియుగం దిశగా, చిక్కనవుతున్న సంజె కాంతికి, చరమాంధకారానికి నెలవయిన రాబోయే శతబ్దాల దిశగా, దృష్టి సారించిన కృష్ణ ద్వైపాయన వ్యాసుడి యొక్క సృష్టి వేదం. ప్రజ్ఞానమయ యుగాలకి, విరాజమాన ఉషస్సులకి చెందిన మన ‘పితరులు’ తమ వారసులకి అందించిన ఆఖరి వీలునామా వేదం. అధోతలాల దిశగా, భౌతిక జీవనం దిశగా, బుద్ధి గత, తార్కిక, హేతు నిబద్ధమైన జీవనం దిశగా ఉన్ముఖులైన మానవాళికి వారు అందించిన చరమ సందేశం వేదం.

(*వేదంలో “ప్రాచీన” మరియు “ఆధునిక” ఋషుల ప్రస్తావన వస్తుంటుంది. ఆ ప్రాచీన ఋషులని ఇంచుమించుగా దేవతామూర్తులుగాను, జ్ఞానానికి మూలకర్తలుగాను పరిగణించవచ్చునేమో.)

అయితే ఇవన్నీ నిరాధారిత ఊహాగానాలే, అనుమానం చేత గ్రహించే విషయాలే. మానవ యుగ చక్రంలో గతానికి చెందిన భావ జాలం మరుగుపడడం, వినష్టం కావడం తరచు కనిపిస్తుంటుంది. వేదం విషయంలో అదే జరిగినట్టుంది. వేదం తరువాత భారతీయ అధ్యాత్మిక చరిత్రలో మహర్దశగా చెప్పుకోదగ్గ వేదాంత యుగారంభానికే వేద చింతన బాగా మరుగుపడిపోయింది. ప్రాచీన వైదిక జ్ఞానం నుండి వీలైనంత భాగాన్ని సంరక్షించి దానికి కొత్త ఊపిరి పోయడానికి ప్రయత్నించింది వేదాంతం. ఒక విధంగా ఈ పరిణామం అనివార్యమే ననిపిస్తుంది. ఎందుకంటే వేద ఋషులు సంస్థాపించిన చింతనా వ్యవస్థ సాధారణ మానవాళికి అందరాని అనుభవాల మీద ఆధారపడినది. ఆ శోధనలో వారికి ఉపయోగపడ్డ చేతనా సామర్థ్యాలు సామాన్యులలో ప్రచ్ఛన్నంగా ఉంటాయి.  లేక అసంపూర్ణంగా వికాసం చెంది ఉంటాయి. ఆ సామర్థ్యాలు కొందరిలో మేలుకొని వున్నా, వాటిలో ఎన్నో అనుచిత అంశాల మేళవం కనిపిస్తుంది. సత్యాన్వేషణలో ఆరంభంలో ఉండే శోధనా తీవ్రత నెమ్మదించాక, వేసటతో కూడుకున్న దశలు రావచ్చు. అలాంటి దశలలో పాత సత్యాలు పాక్షికంగానైనా వినష్టం కావచ్చు. అలా వినష్టమైన భావసారాన్ని ఆ ప్రాచీన గీతాల పునఃపరిశీలన ద్వారా తిరిగి సాధించడం అంత సులభం కాదు. ఎందుకంటే వేదఋక్కులు ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థాన్ని సూచించే భాషలో కూర్చబడ్డాయి.

ఒకసారి మూలరహస్యం తెలిస్తే మనకి అర్థం కాని భాష కూడా అర్థమయ్యే అవకాశం వుంటుంది. కాని ఉద్దేశపూర్వకంగా ద్వంద్వార్థంతో చేసిన రచన లోని అంతరార్థాన్ని వెలికి తీయడం మరింత కష్టం. ఎందుకంటే అందులో శోధనని తప్పుదోవ పట్టించే ఎరలు ఎన్నో ఉంటాయి. కనుక భారతీయ మానసం మరలా వేదంలోని అంతరార్థాన్ని తెలుసుకోగోరే ప్రయత్నం చేసినప్పుడు ఆ కర్యం కఠినంగా తోచింది, పాక్షిక విజయమే లభించింది. ఈ రహస్యాన్ని ఛేదించగల ఒక్క మూలం మాత్రమే ఇంక మిగిలింది. వేదమంత్రాలని జ్ఞాపకం పెట్టుకుని పారంపర్యంగా ప్రచారం చేసే వాళ్లు, లేదా వైదిక కర్మకాండకి అధ్వర్యం వహించే వాళ్లు, మనకి అందించే ఆ ప్రాచీన, సాంప్రదాయక జ్ఞానం. అసలు వేదమంత్రాల బోధన, కర్మకాండ నిర్వహణ – ఈ రెండు కార్యాలు మొదట్లో ఏకమై వుండేవి. తొలిరోజుల్లో యజ్ఞం చేసే యాజ్ఞికుడే వేదగురువు కూడా అయ్యేవాడు. కాని వేదంలోని తేజం, సారం అప్పటికే మరుగుపడిపోయాయి. వైదిక కర్మకాండ జరిపించే మేటి పురోహితులకి కూడా ఆ మంత్రాలలోని శక్తి గురించి, వాటి అంతరార్థం గురించి అపరిపూర్ణమైన అవగాహన మాత్రమే వుండేది. ఎందుకంటే వైదిక కర్మకాండలోని బాహ్యాచారం అందులోని ఆంతరిక జ్ఞానం మీద ఓ దట్టమైన బెరడులా పేరుకుపోయింది. ఏ ఆంతరిక సారానికి అది రక్షక కవచంగా మొదట్లో ఏర్పాటు చెయ్యబడిందో ఆ ఆంతరిక సారానికి కారాగారంలా పరిణమించింది. ప్రతీకాత్మకంగా జరిపించే కర్మకాండలోని శక్తి క్రమంగా హరించుకుపోసాగింది. ఆ ప్రాచీన పునీత గీతంలోని తేజం తొలగిపోయింది. కరుకైన, అయోమయమైన ఉపరివిషయం మాత్రమే మనకి మిగిలింది.

(ఇంకా వుంది)




No comments:

Post a Comment