Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Thursday, December 5, 2013

ది(భు)వి నుండి భు(ది)వికి - శ్రీ అరొబిందో కథ

ది(భు)వి నుండి భు(ది)వికి
శ్రీ అరొబిందో కథ

శ్రీ అరొబిందో కథని ఒక ఉపమానంతో ప్రారంభిద్దాం.
అది  60ల నాటి భారతదేశం.  ఒకప్పుడు వజ్రాలకిరీటంలా వెలిగిన దేశంలో చిక్కని చీకట్లు అలముకున్నాయి. నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. చదువులు నాశనం అవుతున్నాయి. నిత్యావసరాల కొరత. పొలిమేరల్లో యుద్ధం. మనుషుల మనసుల్లో "వైరాగ్యం" చోటు చేసుకుంటోంది. ఈ దుస్థితి నుండి తప్పించుకోవడానికి ఎవరికి వారు ఏవో దార్లు వెదుక్కుంటున్నారు. కొందరు ఇంగ్లండు వెళ్లి అక్కడే ఉండిపోయారు. మరి కొందరు గల్ఫ్. లేకుంటే ఆఫ్రికా... అమెరికా. ఇలా నాలుగు దిక్కులకి పరుగులు పెట్టి ఎందరో విముక్తులు అయ్యారు. ఈ "ముక్తి"ని ప్రసాదించే మార్గాలన్నిటిలోనూ మూలసూత్రం ఒక్కటే - భారత దేశాన్ని మార్చడం అసంభవం, వొదిలి పారిపోవడమే సమంజసం. ఈ నినాదమే అభినవ వందేమాతరమై, మంత్రమై ఎందరికో మళ్లీ స్వాతంత్రాన్ని ఇచ్చింది.
          ఈ అన్యాయాన్ని చూసిన ఓ వ్యక్తి సహించలేకపోయాడు. పోషించలేని తల్లిని విడిచే సంస్కారానికి అతడి గుండె రగిలింది. పలాయన పద్ధతిలోని ఔచిత్యాన్ని అతడి మేధ ప్రశ్నించింది. పలాయన మార్గం ఏనాటికైనా బహు కొద్ది మందిని మాత్రమే ఆదుకుంటుంది. మరి మిగిలిన వారికి శాశ్వత క్షోభ తప్పదా? "అక్షోభమైన ఎన్నో ప్రాంతాలని చూశావు. ఆనందించావు. ఆ పరవశంలో అసలు సమస్యని మరిచావు. కాని నీ మరపు చేత సమస్య రద్దు కాలేదు. వాయిదా పడిందంతే. పారిపోవడం పరిష్కారం ఎలా అవుతుంది? ఆనంద సీమల్ని ఒంటరిగా చేరుకోవడం పరిష్కారం కాదు. పరిష్కారానికి ఆరంభం మాత్రమే. అటుపై ఆ సౌఖ్యంతో ఈ దైన్యాన్ని తుడిచివేయాలి. అక్కడ నేర్చిన చదువుల నిక్కడ అమలు జరపాలి. అక్కడ గడించిన ధనాన్ని ఇక్కడ రాశులు పోయాలి. అక్కడి అమూల్య తత్వానికి ఇక్కడ గుడి కట్టాలి," అని ఘోషించాడా వ్యక్తి.

          ఈ ఉపమానాన్ని అధ్యాత్మిక రంగానికి వర్తింపజేయాలి.
          అధ్యాత్మిక రంగంలో ఇటువంటి అసమాన ధీరుడి కథే శ్రీ అరొబిందో కథ.

                                                                             *        *        *
          శ్రీ అరొబిందో ఆగస్టు 15 నాడు, 1872 లో కలకత్తాలో పుట్టారు. తండ్రి కృష్ణ ధన్ ఘోష్ కి పాశ్చాత్య సంస్కృతి అంటే మోజు. అందుచేతనే నాలుగేళ్ళ శ్రీ అరొబిందోని, అతడి ఇద్దరు అన్నల్ని చదువుల కోసం ఇంగ్లండు పంపించేశాడు. మాంచెస్టర్ లో ఓ మతాధికారి కుటుంబానికి పిల్లల బాధ్యత అప్పజెప్పి "భారతీయుల తోను, భారతీయ సంస్కృతితోను ఏ విధంగానూ సంపర్కం కలగకుండా" జాగ్రత్త పడమన్నాడు.

          ఇంగ్లండ్ లో శ్రీ అరొబిందో చదువులు మనసుతో చేసే తీవ్ర తపస్సే అయ్యాయి. పన్నెండేళ్ల నాటికే ఫ్రెంచ్, లాటిన్, భాషల్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఈయన ప్రతిభ చూసి స్కూల్ హెడ్ మాస్టర్ పూనుకుని గ్రీక్ భాష కూడా నేర్పించాడు. ఆ కాలంలో శ్రీ అరొబిందో అత్యంత ప్రియమైన వ్యాపకం (క్లాసులు ఎగ్గొట్టి) ఏకాంతంగా చదువుకోవడం. ఇంగ్లీషు, ఫ్రెంచ్ కవులే కాక అరిస్టోఫేన్స్, హోమర్, డాంటే, గోథేల కవిత్వం కూడా ఆ ఏకాంతానికి అలంకారం అయ్యేది.
          కాలేజి దశలో ఆయన మనస్సు కవిత్వం నుండి విప్లవం మీదకి మళ్లింది. షెల్లీ, డాంటేల స్థానంలో జోన్ ఆఫ్ ఆర్క్, మజ్జినీలు వచ్చి చేరారు. ఫ్రెంచ్, అమెరికన్, ఐరిష్, విప్లవ చరిత్రలు లోతుగా చదివారు. స్వదేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా ఉద్యమించాలో అప్పటికే నిర్దిష్టమైన భావాలు ఏర్పడ్డాయి. కేంబ్రిడ్జ్ లో బీ.ఏ. పట్టం పొందాక ఐసియస్ లిఖిత పరీక్షలో నెగ్గారు. కాని గుర్రపు స్వారి పరీక్షకి హాజరు కాకపోవడంతో ఐసియస్ లో ఎంపిక కాలేదు. అనతి కాలంలోనే 1893 లో (వివేకానందుడు చికాగోలో ప్రసంగించిన ఏట) తన 21 వ ఏట ఇండియాకి తిరిగి వచ్చేశారు.

          పద్నాలుగేళ్ల పాశ్చాత్య అనుభవం నుండీ శ్రీ అరొబిందో తనతో ఇండియాకి తిరిగి తెచ్చుకున్నదేమిటి?
          మనసులోని ఊహలకి ఆచరణ రూపాన్నివ్వడం, అంతర్యంలో ఉన్నదాన్ని ప్రకటిస్తూ బాహ్య నిర్మాణం చెయ్యడం - ఇదీ పాశ్చాత్య సంస్కృతి గొప్పదనం. ఈ సత్యం శ్రీ అరొబిందో హృదయంలో శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంది.

                                                                             *        *        *

          ఇండియాకి తిరిగి రావడంతోనే విప్లవ వ్యవహారాలని ప్రారంభించారు. ఆదిలో బరోడాలో మహారాజా కళాశాలలో ఫ్రెంచ్ ప్రొఫెసర్ గా ఉండేవారు. ఈ దశ నుండే పదునైన విప్లవ వ్యాసాలు వెలువడేవి. "అయ్యా! బాబూ! సంఘ సంస్కరణలు చెయ్యండి" అంటూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని వేడుకునే అప్పటి కాంగ్రెస్ పార్టీ వైనాన్ని "భిక్షా పద్ధతి" అని దుమ్మెత్తి పోశారు. "మన అసలు శత్రువు మన బయట ఉన్న వేరే ఏదో శత్రువు కాదు. మన హేయమైన బలహీనతే, పిరికితనమే, గ్రుడ్డి హృదయదౌర్బల్యమే," అంటూ మన అశక్తతకి కారణాలని శోధించారు. భారతదేశాన్ని ఇంత హీన స్థితిలో ఉంచే ఆ కారణాలేమిటో క్రమంగా స్పష్టం కాసాగాయి.

          గత వేయ్యేళ్లకి పైగా భారత దేశంలో ఆచరించబడ్డ అధ్యాత్మికత భౌతిక ప్రపంచాన్ని, ఐహిక జీవనాన్ని చులకన చేస్తూ వచ్చింది. ఆత్మ అనబడే అలౌకిక తత్వాన్ని కనుగొనడమే జీవితానికి పరమ లక్ష్యం అని బోధించింది. ప్రపంచం మిథ్యా సృష్టి, అసలు లేనిది, అంటూ ఏదో అగోచర తత్వం దిక్కుగా మనుషుల మనసులని మరల్చింది. "ప్రపంచం దు:ఖమయం, అదెన్నటికీ మారదు. దాని కర్మకి దాన్ని విడిచి ఆ అమృత తత్వాన్ని తెలుసుకో, నీ మేలు నువ్వు చూసుకో" అంటూ ఆ దుక్కులో నడవ గలిగిన కొద్ది మందినీ తొందర పెట్టింది.  ఆ విధంగా ప్రపంచం మీద శ్రద్ధ నశించిన సమాజం ప్రపంచం మీద పట్టు కోల్పోయింది. జీవితాన్ని విస్మరించిన పాపానికి దేశంలో జీవశక్తి అణగారింది. ధూళిలో పడి ఉంది.

          మరి ఈ దేశాన్ని తిరిగి లేవనెత్తే మార్గం ఏది? శ్రీ అరొబిందో మనస్సంతా ఈ విచారంతో నిండి ఉంది. "యోగ సాధన చేసి చూడు, మనసు కుదుట పడుతుంది," అని ఓ మిత్రుడు సలహా ఇచ్చాడు. "ప్రపంచాన్ని విడిచిపెట్టమనే యోగమార్గం నాకొద్దు... ప్రపంచాన్ని దాని ఖర్మకి దాన్ని విడిచి ఏకాంత మోక్షాన్ని కోరుకోవడం అంటే ఒక విధమైన అసహ్యం కలుగుతోంది," అని ఆ సలహాని తోసి పుచ్చారు.

          ఇలా ఉండగా ఒకనాడు ఒక చిన్న సంఘటన జరిగింది. కొన్ని సార్లు చిన్న సంఘటనలే జీవితంలో పెద్ద మలుపుకి హేతువులు అవుతాయి.
శ్రీ అరొబిందో తో పాటు విప్లవ చర్యలలో పాల్గొంటున్న తన చిన్నన్న బారిన్ ఒకసారి తీవ్ర జ్వరంతో మంచం పట్టాడు. అంతలో ఆ దారిన వచ్చిన ఓ నాగసన్యాసి బారిన్ ని చూసి కొన్ని మంత్రించిన నీళ్లిచ్చాడు. నీళ్లి తాగిన కొద్ది నిముషాల్లోనే బారిన్ నయమయ్యాడు. ఇది చూసిన శ్రీ అరొబిందో మనసు కొత్త మార్గంలో పయనించింది.

          ఈ లోకం నుండి పారిపోవడానికే కాక యోగశక్తిని ఇతర ప్రయోజనాలకి కూడా వాడుకోవచ్చు అనిపించింది. ఆయన కిప్పుడు శక్తి కావాలి. శతాబ్దాల నిర్లక్ష్యంతో శిధిలమైన దేశాన్ని ఉద్ధరించడానికి అపారమైన శక్తి కావాలి. ఆ శక్తి యోగంలో ఉందేమో! భగవంతుడి ఉన్కి గురించి కూడా నిశ్చయ భావాలు లేని ఆ స్థితిలో ఆయన పరాత్పరుణ్ణి ఉద్దేశించి, "నువ్వంటూ ఉంటే నీకు నా మనసు తెలుసు. నేను ముక్తిని కోరుకోవడం లేదని  నీకు తెలుసు. అన్యులు కోరుకునేవి ఏవీ నాకొద్దు. నాకీ దేశాన్ని ఉద్ధరించడానికి శక్తి కావాలి. నేను ప్రేమించే ఈ మనుషుల కోసమే జీవించి, వారి కోసం కృషి చేసే అవకాశం కావాలి," అనే ప్రార్థనతో యోగమార్గంలో ప్రవేశించారు.

          యోగంలో పరిపూర్ణత కోసం గురువుని ఆశ్రయించే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. 1907 లో విష్ణు భాస్కర్ లీలే అనే యోగిని కలుసుకున్నారు శ్రీ అరొబిందో. లీలే ఆదేశాలని అనుసరిస్తూ మూడు రోజుల్లోనే ధ్యాన మార్గానికి పరాకాష్ట అయిన నిర్వాణ స్థితిని చేరుకున్నారు. ఒక్క ఆలోచన కూడా లేకుండా మనసు శూన్యమయ్యింది. లీలే యోగానుభవం ఇక్కడితో ఆగిపోవడంతో అప్పటి నుండి అంతర్యామి ఆదేశాల అనుసారం నడుచుకోమని చెప్పి నిష్క్రమించాడు లీలే.

          ఆ భావశూన్య స్థితిలోనే సాధనతోబాటు తన విప్లవ కార్యాలని కూడా కొనసాగించారు శ్రీ అరొబిందో. ఇలా ఉండగా 1908 లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ మీద జరిగిన హత్యా ప్రయత్న నేరానికి శ్రీ అరొబిందో ని అరెస్టు చేసి ఆలిపూర్ జైలులో నిర్బంధించారు. కాని నిజానికి ఆయన నిరపరాధి. జైలులో కూడా సాధన మరింత ఉధృతంగా కొనసాగుతుండగా, ఒకనాడు ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఆయన ఉన్న జైలుగది, కటకటాలు, జైలు కాపరి, జైలులో ఉన్న తోటి నిర్బంధితులు అందరూ నారాయణుడి ప్రతిరూపాలుగా దర్శనమిచ్చారు. ఈ అనుభవంతో ఆయన యోగజీవనం ఒక క్రొత్త మలుపు తిరిగింది. త్వరలోనే ఆయనపై ఆరొపింపబడ్డ నేరం రద్దయి విడుదల పొందారు.

          తరువాత 1901 లో భగవదాదేశాన్ని అనుసరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియకుండా ముందు చంద్రనాగూరుకి, అక్కడి నుండి అప్పటికి ఫ్రెంచ్ హయాంలో ఉన్న పాండిచేరికి  తరలిపోయారు. బ్రిటిష్ వారు పెట్టే హైరానాకి దూరంగా ఆయన మహోగ్ర సాధనకి ప్రశాంత వేదిక అయ్యింది పాండిచేరి నగరం.

                                                                   *                  *                  *

          స్వాతంత్ర్య విప్లవకారులైన శ్రీ అరొబిందో పాండిచేరి లో అధ్యాత్మిక విప్లవమూర్తిగా వికాసం చెందసాగారు. ఇప్పటి విప్లవం దేశం కోసం కాదు, యావన్మావత కోసం. తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వం మీద కాదు, సమస్త ప్రకృతి మీద. ఏనాడో ఆయనలో పుట్టిన ప్రశ్నలు ఇప్పటికీ ఇంకా ఆయన అంతర్యంలో రగులుతూనే ఉన్నాయి. "మానవ జన్మకి లక్ష్యం ఆత్మని కనుక్కుని ఈ లోకం నుండీ పారిపోవడమేనా? పారిపోవడమే మార్గమైతే మరి ఇక్కడ అసలీ పుట్టుక ఎందుకు? అంత అధ్బుతమైన ఆనందం ఆత్మలో ఉండగా ప్రపంచం అంతా ఇలా శోక వాటికలా ఎందుకుండాలి? ఆత్మకు చెందిన వైభవాన్ని ఈ లోకంలో శాశ్వతంగా ప్రతిష్ఠించలేమా?" ధీరమైన ఈ ప్రశ్నల సమాధానాల కోసం అన్వేషణే అయ్యింది ఆయన జీవితం.

          అధ్యాత్మిక రంగంలో పురోగతికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రతి మార్గంలోను అంతంలో ఒక చరమానుభూతి ఉంటుంది. దాన్ని పొందాక సామాన్యంగా ఇక పురోగతి ప్రసక్తి ఉండదు. కాని అప్పటికే సాంప్రదాయక యోగంలో పరమ విజయాలుగా చెప్పుకోబడే అనుభవాలు పొందినా, తన ప్రశ్నలకి సంతృప్తి కరమైన సమాధానాలు దొరకనందున ఇంకా ముందుకి సాగిపోయారు శ్రీ అరొబిందో. పాత సురక్షిత మార్గాలని విడిచి అపరిచిత, అదృశ్య లోకాలని పర్యటిస్తూ వెళ్లారు. ఎన్నో అపూర్వానుభూతులని పరీక్షగా చవి చూస్తూ ముందుకు సాగారు.

          ఈ అన్వేషణలో శ్రీ అరొబిందో సేకరించిన సంగతులు ఇవి అని రెండు వాక్యాలలో చెప్పబోవడం పసితనమే అవుతుంది. అయినా మనం ఎలాగైనా పసివాళ్లమే కనుక ఆయన దర్శనంలో కొన్ని ముఖ్యమైన విషయాలని స్మరిద్దాం. 

          సృష్టిలో కంటికి కనిపించేదీ, కనిపించనిదీ అంతా కేవలం చైతన్య స్వరూపమే, చైతన్య ప్రకంపనల విలాసమే. ఈ చైతన్య ప్రకంపనలు సాంద్రంగా ఉంటే అది జడ పదార్థంలా గోచరిస్తుంది. సూక్ష్మంగా, విరళంగా ఉంటే ఆత్మగా అనుభవమవుతుంది. ఈ రెండు ధృవాలకీ మధ్య ఉన్న చైతన్య స్థితినే మనం మనస్సు అంటాము. మనస్సుకి, జడ పదార్థానికి మధ్య ఉన్నది ప్రాణ శక్తి, లేదా జీవశాక్తి. ఈ విధంగా ఆత్మ, జడ పదార్థం అనే ధృవాల మధ్య అసంఖ్యాకమైన చైతన్య తలాలు విస్తరించి ఉన్నాయి. ఈ చేతనా తలాల అమరిక దృష్ట్యా భూమ్మీద జీవరాశుల పరిణామం ఓ కొత్త కోణం నుండి కనిపించింది.

పరిణామ రహస్యం: భౌతిక వాదులు బోధించినట్టు కేవలం సరళ రూపం గల జీవాలు సంక్లిష్ట రూపం పొందడం కాదు పరిణామం అంటే. రూపంతో బాటు అందులో ఉన్న చైతన్యం కూడా వికాసం చెందుతూ వస్తుంది. ఉచ్ఛమైన చైతన్య స్థితులు క్రమంగా భౌతిక రూపంలో వ్యక్తం కావడమే పరిణామానికి నిర్వచనం. ఎందుకంటే జడ రూపంలో ప్రాణశక్తి ప్రవేశించినప్పుడు జీవరాశులు పుట్టాయి. జీవం గల రూపంలో మానసిక తత్వం వ్యక్తం అయినప్పుడు మానవుడు పుట్టాడు. మరి మనిషి తరువాత మరేదైనా పరిణామ దశ ఉందా?

అతిమానస చైతన్యం:
          తన చైత్య లోక పర్యటనలో శ్రీ అరొబిందో మనో తలానికి ఎంతో ఎత్తున అనుపమానము, అపూర్వము, అతిసుందరము, బృహత్తరము అయిన ఓ చైతన్యాన్ని కనుక్కున్నారు. చిట్టచివరికి ఈ చేతనా స్థితిలోనే ఆయన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి. మనసుకి అతీతమైన ఈ చైతన్యానికి అతిమానస చైతన్యం (supramental consciousness) అని పేరు పెట్టారు. మనస్సు పొరబాటుకి, అజ్ఞానికి పుట్టినిల్లు అయితే, అతిమానసం తప్పుబోని ప్రజ్ఞానికి జన్మ భూమి. వైరుధ్యం, విభజన మనస్సు లక్షణాలైతే, సామరస్యం, సమైక్యత అతిమానసం లక్షణాలు. మనస్సు యొక్క ఆవిర్భావం చేత జంతులోకం మానవలోకమై ఎంతగా పురోగమించిందో, అతిమానస చైతన్య ప్రభావం చేత ముందు ముందు మానవ లోకం కూడా అంతగా వృద్ధి చెందుతుంది అన్నది ఆయన భవిష్యద్దర్శనం. అందుకే గతంలోని జంతు స్థితికి, రాబోయే అతిమానస స్థితికి మధ్యలో ఉన్న "సంక్రమణ జివి మానవుడు" (Man is a transitional being) అన్నారాయన.

          ఆ విధంగా శ్రీ అరొబిందో వ్యక్తిగతంగా చైతన్య తలాలని అధిరోహిస్తూ అతిమానస చైతన్యంతో సంపర్కం పొందారు. కాని అనుకున్నట్లు దాని నుండి మానవత మేలు పొందాలంటే, దాని ప్రభావం భౌతిక ప్రపంచంలోకి ప్రవేశించేట్లు చెయ్యాలి. అంటే ఎత్తు నుండి ఆ చైతన్య స్రవంతి భూమ్మీదకు ప్రవహించేట్లు చెయ్యాలి. అప్పటి నుండి అపర భగీరధుడిలా ఆ చైతన్య గంగను దిగువనున్న లోకాలకి తీసుకురావడం కోసమే తన కృషి నంతా కేంద్రీకరించారు.
         

శ్రీ మాత
శ్రీ అరొబిందో గురించిన ఏ వర్ణన అయినా శ్రీ మాత ప్రస్తావన లేకుంటే అసంపూర్ణమే అవుతుంది. శ్రీ మాతగా లోకానికి తెలియక ముందు "మిరా" అని పిలువబడ్డ ఈమె పారిస్ లో ఫిబ్రవరి 21 న, 1878 లో జన్మించారు. శ్రీ అరొబిందోని వేధించిన ప్రశ్నలే ఎంతో చిన్న వయసులోనే ఈమె చిత్తాన్ని కూడా ఆక్రమించాయి.  "పదకొండు, పదమూడేళ్ల మధ్య వరుసగా ఎన్నో అధ్యాత్మిక అనుభూతులు కలిగాయి. ఈ అనుభవాలు భగవంతుడి ఉన్కిని నిరూపించడమే కాక, మానవుడు ఆయనని కనుగొనగలడని, తన చైతన్యంలో, కర్మలలో ఆయనని సంపూర్ణంగా వ్యక్తం చెయ్యగలడని, భూమిపై ఆయనని ప్రస్ఫుటింపజేసే దివజీవనాన్ని సాధించగలడని తెలియజేశాయి. ఆ విజయాన్ని గురించి, దాన్ని సాధించే పద్ధతిని గురించి కూడా స్వప్న స్థితిలో ఎందరో అధ్యాత్మిక గురువులు బోధిస్తూ వచ్చారు. వారిలో కొందరిని ఆ తరువాత భౌతికంగా కూడా దర్శించడం జరిగింది. [ఆ విధంగా పురోగమిస్తుండగా] వారిలో ఒకరితో నా అధ్యాత్మిక అనుబంధం అంతకంతకు స్పష్టం కాసాగింది... శ్రీ అరొబిందోని [మొదటిసారి] చూడగానే భూమ్మీద ఆ మహత్కార్యాన్ని సాధించడానికి అవతరించింది ఈయనేనని, ఈ కృషిలో ఆయనతో నేను చేయి కలపవలసి ఉందని అర్థమయ్యింది," అని వ్రాసుకున్నారు శ్రీ మాత. 1914 లో మొదటిసారి భారత దేశానికి వచ్చినప్పుడు పాండెచేరిలో శ్రీ అరొబిందోని దర్శించారు. 1918 లో మళ్లీ పాండిచేరి వచ్చి శాశ్వతంగా అక్కడే ఉండిపోయారు.
          అతిమానస చైతన్యాన్ని భూమ్మీదకి తీసుకువచ్చే మహత్కార్య సిద్ధి కోసం అవతరించిన జగజ్జననే శ్రీ మాతే అని ఆదిలోనే గుర్తించారు శ్రీ అరొబిందో. 1926 లో ఆయన సాధన ఒక గొప్ప మలుపు తిరిగినప్పుడు, ఈ అవతార రహస్యాన్ని శిష్యులకి తెలిపి, ఆశ్రమ బాధ్యతలు ఆమెకే అప్పజెప్పి, సాధన మరింత ఉధృతం చెయ్యడానికి ఏకాంతంలోకి విరమించారు.

శ్రీ అరవిందాశ్రమం
          శ్రీమాత సారథ్యంలో శ్రీ అరవిందాశ్రమం నిండుగా వర్ధిల్లింది. సాధారణంగా ఆశ్రమాలలో ఒక గురువు చుట్టూ కొంత మంది శిష్యులు చేరి, ప్రపంచంతో బంధాలు తెంపుకుని, "మోక్షం" కోసం కృషి చేస్తారు. కాని "ఈ ఆశ్రమం సన్యసించి, ప్రపంచాన్ని విడిచిపెట్టడం కోసం సృష్టింపబడలేదు... మరో విధమైన పరిణామాన్ని, జీవనాన్ని సాధించడం కోసం ఒక కేంద్రంగా, కర్మరంగంగా ఈ ఆశ్రమం వెలిసింది," అని వ్రాశారు శ్రీ అరొబిందో. "యోగసిద్ధి కలిగి కూడా సామాన్య జీవితంలో పాల్గొనే వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవనం నిండుగా పుష్పిస్తుంది...అంతరంగిక, బాహ్య జీవనాల మధ్య సంయోగం చేత మానవత ఎంతో ఎత్తుకి వెళ్తుంది, దివ్యమవుతుంది," అని ఆయన స్వాతంత్ర్యోద్యమ దశలోనే గుర్తించారు. అధ్యాత్మిక జీవనం, ఐహిక జీవనం అంటూ దైవాన్ని, ప్రపంచాన్ని కృత్రిమంగా వేరు చేసే అలవాటుని పోగొట్టడం ఆశ్రమ సూత్రాల్లో ఒకటి. అందుకే కాబోలు ఆశ్రమాన్ని ఊరిని వేరు చేసే గోడలేవీ ఉండవు. చెదురుమొదురుగా ఉన్న ఇళ్లలో దేశదేశాల ఆశ్రమవాసులు ఉంటారు. పాఠశాల, ఆసుపత్రి, ఈతకొలనులు, క్రీడాస్థలాలు ఇలా ఒక్కటేమిటి "సామాన్య జీవనం" లోని అంశాలెన్నో ఇక్కడ కనిపిస్తాయి.

అతిమానస అవతరణ
          శ్రీ అరొబిందో-శ్రీమాతల మహత్తర కృషి కారణంగా 1956 లో అతిమానస చైతన్యం పృథ్వీ వాతావరణంలోకి ప్రవేశించింది. నాటి నుండి భూమ్మీద స్థిరంగా దాని ప్రభావాన్ని ప్రసరిస్తూ మానవతని, మానవ జీవనాన్ని ఓ అద్భుత, సువర్ణ యుగం దిక్కుగా తీసుకుపోతోంది. అస్తవ్యస్తమై ఉన్న ప్రస్తుత ప్రపంచంలో అతిసుందర భావిలోకానికి కనిపించని పునాదులు వేస్తోంది. "ఓ నవ్యలోకం జన్మించింది. ప్రస్తుతం మనం సంధికాలంలో ఉన్నాం. ఈ రెండు ప్రపంచాలూ కలగలిసి ఉన్నాయి. ఏదో ఒకనాటికి తగినంత బలాన్ని పుంజుకుని [నవ్యప్రపంచం] ప్రస్ఫుటంగా కనిపిస్తుంది." (శ్రీ మాత)

No comments:

Post a Comment