అధ్యాయం
– 2
వైదిక
సిద్ధాంతం – సింహావలోకనం
మన
బుద్ధిగత, చింతనా సాంప్రదాయాలకి పూర్వయుగానికి చెందిన సృష్టి వేదం. ఆ ఆదిమ యుగంలో ఆలోచన మన తార్కిక హేతువు
కన్నా భిన్నమైన గతులని అనుసరించింది. భాష మన ఆధునిక ప్రమాణాలు అసమ్మతమని భావించే ధోరణులని
అలవరచుకుంది. ఆ యుగంలో మానవోత్తములు, సామాన్య మానవ దైనిక వ్యవహారాలకి, ఇంద్రియ వృత్తులకి
అతీతమైన జ్ఞాన రంగాలలో ఎప్పుడూ ఆంతరిక అనుభూతి మీదను, లోజ్ఞానపరాయణమైన మనస్సు యొక్క
సూచనల మీదను ఆధారపడేవారు. వారి లక్ష్యం ఆత్మప్రకాశనం, తార్కిక నిరూపణం కాదు. వారి ఆదర్శం
అంతఃప్రేరణ గల ఋషి, సునిశిత బుద్ధి గల తార్కికుడు కాదు. వేదమూలాలకి సంబంధించిన ఈ సత్యాన్ని
భారతీయ సాంప్రదాయం భద్రంగా పదిలపరిచింది. ఋషి అంటే ఋక్కులని కూర్చిన ఓ వ్యక్తి కాడు.
ఓ సనాతన సత్యాన్ని, వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని, దర్శించిన ఓ ద్రష్ట. వేద భాషని ‘శ్రుతి’ అంటారు. ఋక్కులలోని లయ బుద్ధి
కూర్చినది కాదు. అది వినిపించినది. వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆత్మశిక్షణ చేత సంసిద్ధుడైన
మానవుడి అంతశ్శ్రవణానికి వినిపించిన, అనంతుడి లోంచి పెల్లుబికిన, ఓ దివ్య ధ్వని.
ఆత్మప్రకాశనం
అన్న వైదిక భావనలో అదేదో మహిమాన్వితమైనది, లోకోత్తరమైనది అన్న భావన ఉండదు. ఆ సామర్థ్యాన్ని
అలవరచున్న ఋషి క్రమబద్ధమైన ఆత్మశిక్షణ ద్వారా
ఆ శక్తిని సాధిస్తాడు. జ్ఞానం అంటే ప్రయాణించడం, అందుకోవడం, కనుక్కోవడం, గెలుచుకోవడం.
ఆ మార్గాంతంలో కలిగేదే ఆత్మప్రకాశనం. చరమ విజయానికి బహుమతి ఆత్మతేజం. ఈ యాత్ర అనే భావన,
సత్యం దిశగా జీవాత్మ సలిపే యాత్ర అన్న భావన, వేదంలో మనకి తరచు ఎదురవుతూ ఉంటుంది. ఆ
యాత్రలో జీవాత్మ ముందుకి సాగుతూ పైపైకి అధిరోహిస్తుంది.
దాని ఆకాంక్ష ఫలితంగా కొత్త చైతన్య, తేజో భూమికలు విప్పారుతాయి. ప్రతాపవంతమైన కృషి
చేత మరింత విస్తారమైన అధ్యాత్మిక ఐశ్వర్యాన్ని గెలుచుకుంటుంది.
చారిత్రక దృష్టితో చూసినప్పుడు, మానవజాతి దాని సమిష్టి పురోగమన పథంలో, ఒక దశలో సాధించిన ఓ మహత్తర ప్రగతికి ఆనవాలుగా వేదం గోచరిస్తుంది. అంతరంగ బహిరంగాలలో జరిగే ఆత్మసమర్పణను వర్ణించే కర్మకాండమే వేదం. ప్రకృతిగత, పాశవిక మానవుడికి
అందని అనుభవైక, భావ భూమికల ఆవిష్కరణని, ఆరోహణని కీర్తిస్తూ, మర్త్యమానవుడిలో పనిచేసే
దివ్య తేజాన్ని, శక్తిని, కృపని కొనియాడుతూ
ఆత్మ పాడే విజయగీతికే వేదం. కనుక అది
బుద్ధిగత వృత్తి నుండి, విశృంఖల ఊహాగానం నుండి పుట్టిన ఫలితాల లిఖిత రూపం మాత్రం ససేమిరా
కాదు. అందులో ఆదిమ మత శాసనాల ఆనవాళ్లు లేవు. పొందిన అనుభవాలలోని సామాన్యత కారణంగా,
అందుకున్న జ్ఞానంలోని వ్యక్తిరాహిత్యం కారణంగా, కొన్ని స్థిర భావాలే వేదంలో పదే పదే
ఆవృతమై వస్తుంటాయి. ఆ భావాలు ఒక స్థిరమైన ప్రతీకాత్మక
భాషలో వ్యక్తం అవుతుంటాయి. మరి మానవ భాష యొక్క ఆ ఆదిమ దశలలో అలాంటి భావజాలం యొక్క వినియోగం
సహజమేనేమో. ఆ దశలో మానవజాతి యొక్క సామాన్య
మానసానికి అందని తత్వాన్ని వ్యక్తం చెయ్యడానికి అవసరమైన మాంత్రిక భావప్రకటనా శక్తితో పాటు కచ్చితమైన నిర్దిష్టత గల అటువంటి భాషాప్రయోగం
అనివార్యమేమో. అవే భావాలు పలు ఋక్కులలో పదే పదే ఆవృత్తం అవుతూ, అవే స్థిర శబ్దాలతో,
అలంకారాలతో, సమాసాలతో మళ్లీ మళ్లీ కనిపిస్తూ ఉంటాయి. ఆలోచనలో కొత్తదనం కోసం గాని, భాషలో
నవ్యత కోసం గాని, కవితలో వన్నెపోని సృజన కోసం గాని పాటుపడుతున్నట్టు కనిపించదు. కవితా
లాలిత్యం మీద గాని, వైభవం మీద గాని, సౌందర్యం మీద గాని వేదఋషుల ధ్యాస ఉన్నట్టు అగుపించదు.
ఒక విధమైన దివ్యగణిత సూత్రావళి మీద నిర్మితమైన
పవిత్ర ఛందోరూపాన్ని ఆలంబనగా చేసుకుని వేదఋషులు శిష్య, ప్రశిష్యుల అవిచ్ఛిన్న పారంపర్యానికి సనాతన జ్ఞానాన్ని సుస్థిరంగా బోధిస్తూ
వచ్చారు.
వేద
ఋక్కులు తీరుగా ఛందోబద్దమై ఉంటాయి. వాటి ప్రయోగంలో మారని సునిశితత్వం, నైపుణ్యం కనిపిస్తాయి.
శైలిలో, కవితా స్వరూపంలో గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అవి కరుకైన కిరాతులో,
అనాగరిక కర్మకారులో చేసిన సృష్టి కావు. ఆత్మాలోకిత ప్రేరణ ప్రోద్బలంగా, గంభీర, సునిర్దేశ్య
గమనంలో సృజన చేస్తున్న, సచేతనమైన, పరమోత్కృష్టమైన కళ యొక్క ఉఛ్వాస నిశ్వాసాలు ఆ కవితలు.
ఇంత ప్రగాఢ సృష్టి కూడా ఒకే నిశ్చిత పరిధిలోను,
మారని కవితా సామగ్రి తోను కూర్చబడినట్టు కనిపిస్తుంది. ఎందుచేతనంటే ఋషులకి కళాత్మక
వ్యక్తీకరణ కేవలం ఒక సాధనం మాత్రమే, ముఖ్య లక్ష్యం కాదు. వారి ప్రధాన ధ్యాస అంతా అత్యంత
క్రియాశీలమైన, ప్రయోజనాత్మకమైన (ప్రయోజనాత్మకత అన్న పదానికి సమున్నత అర్థాన్ని తీసుకుంటే)
లక్ష్యం మీదే వుంది. ఋక్కుని కూర్చిన ఋషికి ఆ ఋక్కు, తనకి, అన్యులకి కూడా అధ్యాత్మిక
పురోగతి సాధించడానికి ఒక మార్గం మాత్రమే. అది అతడి ఆత్మ నుండి ఉదయిస్తుంది. అతడి మనసులో
ఓ శక్తి అవుతుంది. అతడి అంతర్జీవన చరిత్రలో ఓ
ప్రధాన, లేక కీలక ఘట్టంలో చేయబడ్డ ఆత్మాభివ్యక్తీకరణకి సాధనం అవుతుంది. తనలోని
వేలుపుని వ్యక్తం చెయ్యడంలో అది దొహదం చేస్తుంది. దౌష్ట్యానికి ప్రతీక అయిన వినాశిని
నాశనం చెయ్యడంలో సహాయం చేస్తుంది. పరిపూర్ణత కోసం శ్రమించే ఆర్యవీరుడి చేతిలో ఆయుధం
అవుతుంది. కొండ వాలు మీద సంచరించే ఆవర్తకుణ్ణి, మార్గమధ్యంలో ఎదుటపడే తోడేలుని, సెలయేళ్ల
వద్ద పొంచి వుండే చోరుణ్ణి దునుమాడే దేవేంద్రుడి వజ్రాయుధంలా మెరుపులా పెల్లుబుకుతుంది.
(ఇంకా
వుంది)
No comments:
Post a Comment