Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Tuesday, December 3, 2013

అధ్యాయం – 1: సమస్య – పరిష్కారం



అధ్యాయం – 1
సమస్య – పరిష్కారం

అసలు వేద రహస్యం అంటూ ఏదైనా ఉండేదా? ఉంటే ఇంకా వుందా?
సమకాలీన చింతన ప్రకారం ప్రాచీన వేదరహస్యం పూర్తిగా బట్టబయలు అయిపోయింది. దాని సారం సంపూర్ణంగా తేటతెల్లం అయిపోయింది. ఇక అందులో రహస్యం అనేదే లేదు.   వేద ఋక్కులన్నీ ఏదో ఆదిమ, కిరాత జాతి బలిదాన సమయంలో చదివే శాంతిమంత్రాలు. ప్రకృతి శక్తులని వ్యక్తీకరిస్తూ చేసే ఏవో మొరటు పూజలు. అందులో ఉన్నదంతా కేవలం అయోమయమైన, అసంపూర్ణమైన పుక్కిటి పురాణం, ఇంకా పూర్తిగా రూపుదేలని  దృష్టాంతం. తదనంతరం వచ్చిన ఋక్కుల లోనే ఏవో లోతైన తాత్విక, నైతిక భావాల తొలిఛాయలు కనిపిస్తాయి. ఆ భావాలు కూడా “చోరులు,” “వేద ద్వేషులు,” అంటూ వేదఋక్కులలోనే ఎన్నో సందర్భాలలో దూషించబడ్డ ద్రావిడ జాతుల నుండి అరువు తెచ్చుకున్నవే అంటారు కొందరు. అయినా ఆ భావజాలంలోనే తదనంతరం వచ్చిన వేదాంత భావజాలానికి చెందిన  తొలిచిగుళ్ళు కనిపిస్తున్నాయంటారు. మొన్నమొన్నటి దాకా ఉన్న ఆదిమ దశ నుండి అతి వేగంగా మానవ పరిణామం సాగిందనే ఆధునిక భావాలకి, ఈ రకమైన చింతనతో పొత్తు కుదురుతోంది. అంతోఇంతో క్షుణ్ణంగా సాగినట్టుగానే కనిపించే పరిశోధన ఈ చింతనకి మద్దతు నిస్తోంది. ఇంకా శైశవ దశలో ఉండి, అనాధారిత విధానాలని ప్రయోగిస్తూ, నిరంతరం మారే ఫలితాలని ప్రకటించే, ఎన్నో క్రొంగొత్త శాస్త్రాలు – తులనాత్మక శబ్దవ్యుత్పత్తి శాస్త్రం, తులనాత్మక పౌరాణిక శాస్త్రం, తులనాత్మక మతవిజ్ఞానం మొదలైనవి -  ఈ చింతనకి చేయూతనిస్తున్నాయి. 

          ఒక ప్రాచీన సమస్యని ఓ క్రొత్త దృక్పథంతో ప్రదర్శించడం ఈ అధ్యాయాలలో నా ఉద్దేశం. ఇంతవరకు లభ్యమైన పరిష్కారాలని తిరస్కరించే వినాశాత్మక పద్ధతిని నేను అవలంబించబోవడం లేదు. నిర్మాణాత్మకంగా, ధనాత్మకంగా మరింత విశాలమైన పునాదుల మీద గత పరిష్కారాలకి పరిపూరకమైన సిద్ధాంతాన్ని నిర్మించబోతున్నాను. సాధారణ సిద్ధాంతాలు అంతంతమాత్రంగానే పరిష్కరించిన కొన్ని సమస్యల మీద నా కొత్త సిద్ధాంతం  నవీన కాంతులు చిందించే అవకాశం ఉంది.

          ఋగ్వేదంలోని శ్లోకాలని అతిప్రాచీనమైన భాషలో వ్యక్తం చెయ్యడం జరిగినందు వల్ల వాటి అన్వయంలో ఎన్నో తేలని సమస్యలు తలెత్తుతున్నాయి. (యూరోపియన్ పండితుల అభిప్రాయంలో ఈ ఋగ్వేదం ఒక్కటే అసలైన వేదం). అందులో కనిపించే అతి ప్రాచీనమైన శబ్దజాలం, శైలి మరింత అర్వాచీన భాషలో కనిపించదు. వాటి భావాన్ని నిర్ధారించే ప్రయత్నం కూడా సంధిగ్ధంగానే ఉంటుంది. ప్రాచీన సంస్కృతంలో ఉండే ఎన్నో పదాలు ఆ వేదంలోనూ కనిపించినా, వాటి అర్థం విషయానికి వస్తే తరువాత వచ్చిన సాహితీసాంప్రదాయంలో ఆ పదాల అర్థానికి, వేదంలో వాటి అర్థానికి మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. వేదంలో వాడబడిన పరిభాషలో, అత్యంత సామాన్య పదాలు కూడా, అర్థాన్ని తేల్చి చెప్పడంలో అతి కీలకమైన పదాలు కూడా, ఒకదానితో ఒకటి సంబంధం లేని అనేకార్థాలని సంతరించుకోగలవు. మనం ఎంచుకున్న అర్థాన్ని బట్టి సంపూర్ణ శ్లోకాలు, సంపూర్ణ కాండాలు మాత్రమే కాక అసలు సమస్త వేద చింతనే బహుళార్థాలతో ప్రకాశిస్తుంది. ఈ ప్రాచీన స్తోత్రాల అంతరార్థాన్ని నిర్ధారించేందుకు గాను గడచిన వేల ఏళ్లలో కనీసం మూడు  సారులైనా గణనీయమైన ప్రయత్నాలు జరిగాయి.  ఈ మూడు ప్రయత్నాలలో కూడా వాడబడ్డ పద్ధతులు వేరు, వచ్చిన ఫలితాలూ వేరు. అలాంటి ప్రయత్నాలలో మొట్టమొదటిది పూర్వచారిత్రక యుగంలో జరిగింది. ఆ ప్రయత్నం గురించిన అవశేషాలు మనకి బ్రాహ్మణాలలోను, ఉపనిషత్తులలోను కనిపిస్తాయి. ఆ తరువాత కాలంలో భారతీయ పండితుడు శయనుడు చేసిన సాంప్రదాయనిబద్ధమైన అన్వయం మనకి లభ్యం అవుతోంది. ఇక అర్వాచీన కాలంలో యూరొపియన్ పాండిత్యం ఎంతో తులనత్మక పరిశీలన చేసి, ఎంతో ప్రయాస పడి చేసిన అన్వయం మనకి మిగిలింది. ఈ చివరి రెండు ప్రయత్నాలలోను ఒక సామాన్య లక్షణం కనిపిస్తోంది. వాటి అన్వయాల బట్టి పరిశీలిస్తే ఆ ప్రాచీన స్తోత్రాలు అసామాన్యమైన అసంబద్ధత గలవిగా, భావశూన్యమైనవిగా కనిపిస్తాయి. ప్రత్యేక వాక్యాలని తీసుకుని, వారి సిద్ధాంతాల ప్రకారం అన్వయిస్తే అంతోఇంతో భావం ఉన్నట్లుగానే ఉంటుంది. అయితే అనవసర శబ్దపుష్టితో, అనుచితమైన అలంకారంతో, భావం అల్పంగాను, శబ్దం అనల్పంగాను ఉన్నట్టు కనిపిస్తుంది. కాని ఆ శ్లోకాలని ఓ అఖిలఘనరాశిగా తీసుకుని పరిశీలించినట్లయితే, తక్కిన ప్రాచీన జాతులకి చెందిన రచయితలకి మల్లె కాక,  వేదకవులకి సుసంబద్ధమైన, సహజమైన, సజావైన భావవ్యక్తీకరణ సాధ్యం కాదా అన్న ప్రశ్న పుట్టక మానదు. కాస్త క్లుప్తమైన, సరళమైన వేదభాగాలలో తప్ప, తక్కిన చోట్ల భాష కృతకంగాను, అయోమయంగాను తోచుతుంది. భావాలలో ఒకదానికొకటి సంబంధం లేకపోయినా అన్వయకారుడు వాటిని బలవంతంగా ఒక దరికి చేర్చినట్టు అనిపిస్తుంది. అన్వయం చేయబోయిన పండితుడు అభూతకల్పన చేస్తున్నాడేమో ననిపిస్తుంది. ఈ ప్రయత్నాలలో  మనకి కనిపించేది వేదరహస్యం బహిర్గతం కావడం కాదు.  అన్వయానికి లొంగని సమాచారాన్ని బుద్ధి పుట్టినట్టు బలవంతంగా మలచుకోవడమే ఇక్కడ కనిపిస్తోంది. 

(ఇంకా వుంది)

No comments:

Post a Comment