అయితే ఆ వెలితి మనం చేజేతులా
సృష్టించుకున్నదే గాని ఆ ప్రాచీన, పవిత్ర రచనలలో లేదని నాకు అనిపిస్తోంది. మానవ చింతన యొక్క తొలిదశలకి
చెందిన అద్భుతఘట్టం యొక్క లిఖితరూపమే ఋగ్వేదం అని నేను ప్రతిపాదిస్తున్నాను. చరిత్రాత్మకమైన
ఎల్యూసియన్, ఆర్ఫిక్ నిగూఢదశలు కూడా ఆ అపూర్వ ఆది దశ యొక్క పెళుసైన అవశేషాలే. మరి ఆ
దశలలో మానవజాతికి చెందిన అధ్యాత్మిక, తాత్విక జ్ఞానం అంతా గుప్తంగా ఎందుకు ఉంచబడిందో
ప్రస్తుతం అంతుచిక్కడం లేదు. అథములకి, అనర్హులకి అందకుండా ఆ జ్ఞానం అంతా స్థూల, భౌతిక
ప్రతీకలలోను, ముసుగులలోను గూఢంగా ఉంచబడింది. ఆ ఆత్మజ్ఞానాన్ని, దేవతల వరమైన ఋత జ్ఞానాన్ని,
పవిత్రంగా, గుప్తంగా ఉంచడం ఆ ప్రాచీన ఋషుల ముఖ్యోద్దేశం అనిపిస్తోంది. అలాంటి ప్రజ్ఞ
సామాన్య మానవ మనస్సుకి అందడం అనుచితమే కాక అపాయకరం కూడా అని వాళ్లు భావించి ఉంటారు.
ఆ జ్ఞానం అపరిపక్వ, అపరిశుద్ధ మనస్కులకి అందితే దాన్ని వాళ్లు వక్రపరిచి, దుర్వినియోగం
చేసే అవకాశం ఉంది. అందుకే ఋషులు అనుత్తమమైనదే అయినా ఫలదాయకమైనది కనుక అథములకి బాహ్యపూజని
బోధించారు. అర్హులకి ఆంతరిక మార్గాన్ని బోధించారు. అందుకే అర్హులకి అంతరార్థం స్ఫురించేలా,
బాహ్యపూజా మార్గాన్ని అనుసరించే జనసామాన్యానికి స్థూలార్థం స్ఫురించేలా వారు ద్వంద్వార్థం
గల భాషనే ప్రయోగిస్తూ వచ్చారు. వేదఋక్కులన్నీ ఈ ప్రాతిపదిక మీదనే సూత్రీకరించబడ్డాయి,
నిర్మించబడ్డాయి. అందులోని శ్లోకాలు, కర్మకాండలు అన్నీ బాహ్యంగా చూస్తే ఆ కాలంలో ప్రచారంలో
ఉన్న సామాన్య మతంతో పొసగే విధంగా ప్రకృతి పూజలోని సాధారణ విశేషాలుగా గోచరిస్తాయి. కాని
ఆంతరికంగా చూస్తే అవన్నీ ఆనాటి మానవజాతికి సాధ్యమైన అత్యుత్తమ ఆత్మైక సంస్కృతిని, అధ్యాత్మిక
వికాస మార్గాన్ని, అనుభవాన్ని, జ్ఞానాన్ని వ్యక్తం చెయ్యగల వీలైన, మేలైన పదాలుగా ద్యోతకమవుతాయి.
శయనాచార్యుడు గుర్తించిన బాహిరమైన కర్మకాండ అంతా వాస్తవమైనదే కావచ్చు. ఐరోపా పండితులు
సూచించిన ప్రకృతిగతమైన అన్వయాన్ని కూడా స్వీకరించవచ్చు. కాని వాటి వెనుక ఎప్పుడూ దాగి
వున్న వేదరహస్యం ఒకటుంది. పరిశుద్ధాత్ముడిని, ప్రబుద్ధ మానసుడిని ఉద్దేశించి పలికిన
రహస్య పదాలవి (నిణ్యా వచాంసి). వేద శబ్దాల నిజార్థాన్ని ముందు స్థిరంగా స్థాపించి,
వాటి సహాయంతో గుప్తంగా ఉన్న, అతి ముఖ్యమైన ఈ అంతరార్థాన్ని వెలికితీసి, వేదప్రతీకల
అర్థాన్ని, దేవతల ఆత్మగత క్రియలని నిర్ణయించడం కష్టమే కాని, అత్యవసరమైన కార్యం. ఈ పుస్తకంలోని వివిధ అధ్యాయాలు,
వాటి చివరిలో వచ్చిన అనువాదాలు అన్నీ ఆ దిశలో ఒక సన్నాహం అవుతాయి.
ఈ ప్రతిపాదన సమంజసమైనది అని
తేలితే దాని వల్ల మూడు ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల ఉపనిషత్తులలో ఇంతవరకు సరిగ్గా
అర్థం గాక, లేకుంటే తప్పుగా అర్థమైన విభాగలు మరింత సరళంగా, సఫలదాయకంగా అర్థమవుతాయి.
అలాగే పురాణాల మూలాల గురించి కూడా అర్థమవుతుంది.
భారతీయ ప్రాచీన సాంప్రదాయం సమస్తాన్ని సహైతుకంగా వివరించడానికి వీలవుతుంది. వేదాంతం,
పురాణం, తంత్రం, తాత్విక సాంప్రదాయాలు, ఘనమైన భారతీయ మతాలు – అన్నిటికీ మూలం వేదమే
నని తెలుస్తుంది. వాటి తొలి బీజాలు అక్కడ మనకి కనిపిస్తాయి. తదనంతరం వచ్చిన భారతీయ
చింతనకి కూడా మూలాలు అక్కడ కనిపిస్తాయి. ఆ విధంగా భారతీయ నేపథ్యంలో తులనాత్మక మత పరిశోధనకి
ఒక స్థిరమైన వేదిక ఏర్పడుతుంది. అర్థం లేని హఠాత్ పరిణామాలకి, అర్థం కాని సంక్రమణాలకి వివరణ వెతికే ప్రయత్నంలో
వ్యర్థ ఊహాగానలతో ఇక కాలయాపన చెయ్యనవసరం లేదు. హేతువుని తృప్తిపరిచే విధంగా, సహజమైన,
ప్రగతిశీలమైన పురోగమన రహస్యం మనకి అవగతం అవుతుంది. ప్రాచీన దేశాలకి చెందిన వివిధ పౌరాణిక
గాధలలోని అవకతవకలని కూడా అర్థం చేసుకునే వీలు ఉంటుంది. పైపైన చూసే దృష్టికి మాత్రమే
ఆ అవకతవకలు కనిపిస్తాయి. లోతైన అంతరార్థాన్ని పొడచూడగల్గితే అవి మాయమవుతాయి. ఆ ఆంతరిక
సూత్రాన్ని పట్టుకోగలిగితే ఋక్కులు సహైతుక, సజీవ సమస్తాలుగా ద్యోతకమవుతాయి. అందులోని
భావప్రకటనా పద్ధతి, ఆధునిక పద్ధతితో పోల్చితే కాస్త అపరిచితంగా అనిపించినా, ఎంతో సమంజసంగా,
సంక్షిప్తంగా తోచుతుంది. నిరర్థక శబ్ద పుష్టికి బదులు, పరిమిత పదజాలంలో అపరిమిత భావసంపదని
కుదించే ధోరణి కనిపిస్తుంది. కిరాతుల జీవన శైలిని తెలిపే అవిశేష కథనంగా కాక, ప్రపంచ
ప్రాచీన సద్గ్రంథాలలో అత్యుత్తమ స్థానాన్ని ఆక్రమించే రచనగా వేదం సాక్షాత్కరిస్తుంది.
(మొదటి అధ్యాయం సమాప్తం)
No comments:
Post a Comment