Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Monday, December 9, 2013

సమస్య - పరిష్కారం (3 వ భాగం)



వేదరహస్యాన్ని గురించి ప్రతిపాదించబడ్డ సిద్ధాంతాలలో మరో వెలితి కూడా కనిపిస్తుంది. వేదాలలో ప్రకృతి శక్తులకి చేసే స్థూల పూజకి, ప్రాచీన గ్రీకు సాంప్రదాయానికి చెందిన అభ్యుదయ మతానికి, ఉపనిషత్తులలోను, పురాణాలలోను పేర్కొనబడ్డ దేవతల యొక్క అధ్యాత్మిక, మానసిక వృత్తులకి, మధ్య ఎంతో తేడా ఉంది. ఏ సంస్కృతిలో నైనా మానవ మతం యొక్క ప్రప్రథమ వికాసమాన దశలలోబాహ్యమైన ప్రకృతి శక్తుల అర్చన కనిపిస్తుందని, మనిషికి తన అంతర్యంలో  స్ఫురించే చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని బాహ్య ప్రకృతి శక్తుల మీద ఆధ్యారోపించడం సహజమేనని, వివరించే ఆధునిక సిద్ధాంతాన్ని ప్రస్తుతానికి మనం స్వీకరిద్దాం.


వేదంలో అగ్ని అంటే నిస్సందేహంగా నిప్పు అనే అనుకోవాలి. అలాగే సూర్యభగవానుడు అంటే సూర్యుడు. పర్జన్యం అంటే వర్షామేఘం. ఉష అంటే వేకువ. ఇక మరి కొందరు దేవతల విషయంలో వారి  క్రియలు గాని, ధర్మాలు గాని స్పష్టంగా లేకపోతే, ఆ దేవతల పేర్ల వ్యుత్పత్తిలోకి సునిశితంగా శోధించి, దానికి కాస్తంత ఊహాగానం జోడించి, ఆ దేవతల లక్షణాలని అర్థం  చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆధునిక చారిత్రక కాలమానం ప్రకారం, వేదకాలానికి తరువాత వచ్చినా, ఆ కాలానికి మరీ దూరంలో లేని ప్రాచీన గ్రీకు సాంప్రదాయంలో మాత్రం గణనీయమైన తేడా కనిపిస్తుంది. ఆ సాంప్రదాయానికి చెందిన దేవతల విషయంలో, వారికి ఉద్దేశింపబడ్డ ఆంతరిక ధర్మాలు, వారి భౌతిక ధర్మాల కన్నా ఉన్నతమైనవిగా, ప్రధానమైనవిగా పరిణమించాయి. ప్రాచీన గ్రీకు సాంప్రదాయంలో  ప్రచండుడైన అగ్ని దేవత కాస్తా తదనంతర కాలంలో మరింత శాంతస్వభావుడైన కర్మ దేవతగా మారాడు. అలాగే సూర్యసమానుడైన అపోలో, కవితా స్ఫూర్తికి, తాత్విక అభినివేశానికి అధిదేవత అయ్యాడు. ఉషస్సుకి ప్రతీక అయిన ఏథీన్ దేవత, తన భౌతిక ధర్మాలన్నీ మర్చిపోయి జ్ఞానానికి అధిదేవత అయ్యింది. అలాగే యుద్ధం, ప్రేమ, సౌందర్యం ఇలా ఎన్నిటికో ప్రతీకలైన దేవతలందరి విషయంలోను భౌతిక కర్మలు మటుమాయం అయిపోయాయి, విస్మరించబడ్డాయి. మానవ నాగరికత యొక్క పురోగమన క్రమంలో ఇలాంటి మార్పు అనివార్యం అంటే సరిపోదు. ఆ మార్పు వెనుక ఉన్న కారణాలని శోధించాలి, విశదీకరించాలి. ఈ మార్పు గ్రీకు పురాణంలో ఎలా జరిగిందో, మన పురాణాలలో కూడా దేవతల పేర్లలో, ప్రతీకలలో జరిగిన ప్రతిక్షేపం ఇంచుమించు అదే విధంగా జరిగింది. సరస్వతీ నది విద్యాదేవతగా మారింది. వేదాలలోని విష్ణువు, శివుడు ఇప్పుడు అత్యుత్తమ భగవత్తత్వానికి ప్రతీకలు అయ్యారు. విశ్వం యొక్క వికాసాన్ని, వినాశనాన్ని శాసించే దేవతలుగా త్రిమూర్తులలో చేరిపోయారు.  ఈశోపనిషత్తు సూర్యుణ్ణి జ్ఞాన ప్రకాశనానికి అధిదేవతగా స్తుతిస్తుంది. ఆయన ప్రభావంతో అత్యుత్తమ జ్ఞానాన్ని చేరుకోవచ్చని అంటుంది. కొన్ని వేల ఏళ్లుగా ప్రతీ బ్రాహ్మణుడు తన నిత్య కర్మలలో భాగంగా జపిస్తూ వచ్చిన గాయత్రీ మంత్రంలో కూడా సూర్యుడికి ఈ విధమైన ధర్మమే ఆపాదించబడింది. ఋగ్వేదంలో ఋషి విశ్వామిత్రుడు వ్రాసిన భాగం నుండి ఈ మంత్రం వచ్చిందని  ఇక్కడ గుర్తించాలి. అదే ఉపనిషత్తులో అగ్ని దేవుడు పాపాలని తొలగించి పావనం చేసే పావకుడిగా, సన్మార్గాన మానవాత్మని దివ్యానందం వద్దకు కొనిపోయే మార్గదర్శిగా, మానవ చర్యల వెనుక ఉండే ఇచ్ఛాశక్తిగా కూడా, కీర్తించబడతాడు. ఇతర ఉపనిషత్తులలో దేవతలు మనిషిలోని ఐంద్రియశక్తులకి ప్రతీకలు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. వేద యజ్ఞానికి అవసరమైన మహత్తర మధుపానాన్ని అందించే ‘సోమం’ అనే మొక్క కాస్తా చంద్రభగవానుడితో సమానం కావడమే కాక, మనిషిలోని మనస్సుని శాసించే దేవతగా గుర్తించబడింది. ఈ పరిణామాలన్నీ బహుళదేవతాసహితమైన ఉపాసనకి, పార్థివ అర్చనా సాంప్రదాయనికి నెలవైన వేద కాలం తరువాత వచ్చినవని అనుకోవాలి. అలాగే దేవతలపై అధ్యాత్మిక ధర్మాలు ఆరోపించబడ్డ కాలానికి ముందు వచ్చినవని అనుకోవాల్సి ఉంటుంది. వేదకాలానికి చెందిన మతంలోని ప్రకృతి నిబద్దమైన అంశం మీదనే మనం అనన్యంగా దృష్టి  నిలపడం వల్లనే ఇలాంటి వెలితి పుట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. 

(ఇంకా వుంది)

No comments:

Post a Comment