Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Thursday, December 5, 2013

సమస్య - పరిష్కారం (2 వ భాగం)



    


అయినా కూడా ఈ అయోమయ, అనాగరక కృతులే ప్రపంచ సాహితీ చరిత్రలో ఓ మహోన్నత స్థానాన్ని ఆక్రమించాయి.  ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రగాఢమైన, శోభాయమానమైన మతానికి అవి ప్రాణం పోయడమే కాక, అత్యంత సునిశితమైన తత్వ చింతనకి కూడా అవి ఊపిరి పోశాయి. బ్రాహ్మణాలలో, ఉపనిషత్తులలో, తంత్రంలో, పురాణంలో, గొప్ప తాత్విక సాంప్రదాయాలలో, ప్రముఖ ఋషుల, మునుల  బోధలలో సత్యమైన దానికి, సాధికారికమైన దానికి పట్టుకొమ్మలుగా, ప్రమాణాలుగా కొన్ని  వేల ఏళ్లుగా వేదాలు నుతింపబడుతూ వచ్చాయి. మానవ మానసం అందుకోగల అత్యుత్కృష్టమైన అధ్యాత్మిక సత్యానికి మరో పేరే వేదం. మానవ వేద్యమైన అతి ప్రగాఢ జ్ఞానమే వేదం. అయితే సమకాలీన అన్వయాలని మనం సమ్మతించినట్లయితే, అవి శయనాచార్యుడి అన్వయాలే కావచ్చు, ఆధునిక సిద్ధాంతాలే కావచ్చు, ఇలాంటి ప్రగాఢమైన, పవిత్రమైన ప్రాముఖ్యత అంతా కేవలం ఓ అభూతకల్పన అన్నట్టు అవుతుంది. ఎప్పుడూ ఐహికమైన లాభాల కోసం, ఆనందాల కోసం ప్రాకులాడుతూ, అత్యంత ప్రాథమికమైన నైతిక భావాలు, మతపర తపనలు తప్ప మరింకేమీ తెలీని అనాగరికుల అమాయక గుడ్డినమ్మకాలకి, అజ్ఞానానికి ప్రతిరూపాలుగా గోచరిస్తాయి వేదఋక్కులు. కొన్ని ప్రత్యేక భాగాల అంతరార్థం, ఈ రకమైన సామాన్య తాత్పర్యానికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపించినా, అది ఈ విధమైన సంపూర్ణ అవగాహనని కూలదోయదు. ఆ కారణం చేత తరువాత వచ్చిన మతాలకి, తాత్విక సాంప్రదాయాలకి పునాదులు ఉపనిషత్తులలోనే ఉన్నాయని అనుకోవాలి. వేదాలలో కనిపించే భౌతిక కర్మకాండకి వ్యతిరేకంగా తాత్విక, తార్కిక బుద్ధి చేసిన తిరుగుబాటు వల్లనే ఈ కొత్త మతాలు, తాత్విక సాంప్రదాయాలు వచ్చినట్టు భావించవలసి ఉంటుంది.

యూరొపియన్ పరిస్థితులతో తప్పుడు పోలిక చేత సమర్ధించబడే ఈ రకమైన చింతన ప్రత్యేకించి వివరించేదేమీ ఉండదు. ఉపనిషత్ భావజాలంలో గోచరించేటువంటి ప్రగాఢమైన, చిరంతనమైన చింతనలు, సునిశితమైన, సువిస్తారమైన మనస్తత్వ విజ్ఞానం, ఏమీ లేని శూన్యం లోంచి పుట్టుకు రావు. పురోగమించే మానవ మానసం క్రమంగా జ్ఞాన శిఖరాలు అధిరోహిస్తూ పోతుంది. లేదా ముందు అయోమయమై, అగోచరమై ఉన్న జ్ఞానాన్ని నవీకరించి, విస్తరింపజేస్తూ పోతుంది. లేదా అసంపూర్ణమైన పాత సూచనల ఆసరాతో కొత్త ఆవిష్కరణలను చేరుకుంటుంది. ఉపనిషత్ చింతనా సాంప్రదాయానికి అంతకు పూర్వం ఏవో గొప్ప మూలాలు ఉండి తీరాలి. ఆ మూలాలు ఏమై ఉంటాయన్న వెలితిని పూరించడానికి చేయబడ్డ పరికల్పన ఒకటి ఉంది. నాగరికులైన ద్రావిడ జాతి నుండి, వారిని జయించిన అనాగరికులైన ఆర్యులు ఈ భావాలని అరువు తెచ్చుకున్నారని ఆ పరికల్పన చెప్తుంది. ఇలాంటి ఊహాగానాన్ని సమర్ధించేది కేవలం మరికొన్ని ఊహాగానాలు మాత్రమే. అసలు పంజాబ్ ద్వారా వచ్చిన ఆర్యుల దండయాత్ర కథనం అంతా శబ్దశాస్త్రవేత్తలు పుట్టించిన పుక్కిటిపురాణమేనా అని సందేహించవలసి వస్తుంది.

ప్రాచీన యూరప్ కి చెందిన తత్వచింతనా సాంప్రదాయాలకి ముందు రహస్యమైన గూఢవిద్యా సాంప్రదాయాలు ఉండేవి. ఆర్ఫిక్, ఎల్యూసీనియన్ గూఢ సాంప్రదాయాలు సిద్ధం చేసిన సస్య మనోభూమిక నుండి పైథాగరస్, ప్లేటోలు ఆవిర్భవించారు. భారతీయ చరిత్రలో చిట్టచివరి చింతనా విప్లవానికి కూడా అటువంటి నాంది ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఉపనిషత్ చింతనకి చెందిన భావరూపాల బట్టి, ప్రతీకల బట్టి, బ్రాహ్మణాల సారాంశం బట్టి చూస్తే, ప్రాచీన భారతంలో కూడా, గ్రీక్ గూఢ సాంప్రదాయాలలో జరిగినట్టు, తత్వచింతనకి రహస్య బోధనల ముసుగు  వేసిన దశ ఒకటి ఉండేదని తలపోయవలసి ఉంటుంది.
 (ఇంకా వుంది)

No comments:

Post a Comment